Saturday, October 1, 2016




గాయం

దేశభక్తి వంటి వుపద్రవం ప్రబలిన
కాలంలో
ప్రజలు లేని భూమి కోసం
సైనికులు మృత స్వప్నాలు కంటున్నపుడు
అతడూ నేనూ ప్రేమించుకొన్నాం

నా దేహం మీద అతడు రాశాడు:
నక్షత్రఖచిత ఆకాశం
మంచుతో తడిసిన పూలు
యెగరేసిన ప్రమాద సూచిక

అతడి నగ్నత్వం మీద నా పెదాలతో గుసగుస లాడాను:
భయవిహ్వలుడొక్కడు పరిగెత్తిన దారి
అడవిలో వొంటరిగా మండుతున్న చెట్టు
మగతగా కళ్ళు మూసుకొన్న పాము

బిడ్డాల్ని పంపి శవాల్ని తెచ్చుకొంటున్న
మాతృ ప్రేమ వంటి వొక మహా వున్మాదం 
మాకు యెడబాటు కల్గించింది
యెవరి లోపల వాళ్ళం గింజుకొన్నాం

ప్రియతమా!
ఆయుధాలు మాత్రమే పండే నేల మిగిలాక
యెవరి దేశంలో వాళ్ళు కాందిశీకులు
కన్నె పిల్లలు వీర పత్నులవడం కోసం
కలలు కంటున్నపుడు
ప్రేమించడమొక దేశ ద్రోహం

మేమిద్దరం ఇపుడొక జానపద గాధ 


  

 

Friday, October 16, 2015

జపాను బౌద్ధ మృత్యు కవితలు



తాము చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు జపాను బౌద్ధ సన్యాసులు రాసిన కవితలు యివి. 1999 లో 
Allan Graham వీటిని యింగ్లీష్  లోకి అనువందించాడు. 

వదలిపోతున్నాను
నిలబడుతూ , కూర్చుంటూ
యెముకల పేర్పు 
లేస్తూ  తేలుతూ  పడిపోతూ 
సముద్రంలో  వురుమునై  

Koho Kennichi – మరణం  1316, వయస్సు 76

.................................................. 

ఖాళీగా వచ్చాను 
ఖాళీగా వెళ్ళిపోతాను 
రావడం పోవడం 
సంక్లిష్టమయిపోయిన సాదా విషయాలు 


Kozan Ichiko – మరణం 1360 వయస్సు  77 

.................................................. 

జీవితం మబ్బులు మంచు 
గుహనుండి బయటికొస్తూ 
విశ్వ కదలిక మీద ప్రతిఫలించే 
వెన్నెలే- మృత్యువు 
దాని గూర్చి యెక్కువ ఆలోచిస్తే 
యెప్పటికీ  విఛిన్నమవుతుంటావు 


Mumon Gensen - మరణం 1390 వయస్సు  68

............................................. 

 జీవిత పరిమళాల్ని రుచి చూస్తూ 
డెబ్భై యేళ్ళు 
మూత్ర దుర్గంధంతో యెముకలు 
యిప్పుడిక యేదయితే యేంటి 
చూడిలా -యెక్కడికి తిరిగెల్తున్నా 
శిఖరం మీద వెన్నెల 
తేటగా వీస్తున్న గాలి 


Tosui – మరణం  1683 వయస్సు  70 

.................................................. 

 రోగ యాత్ర 
పురా భూముల మీదుగా 
పగిలిన కలలు 


Basho –మరణం  1694 వయస్సు  51

............................................. 

నేను రాస్తాను 
వికసితాల్ని తుడిచేస్తాను 
మళ్ళీ వికసిస్తాయి 


Hokushi – మరణం 1718 వయస్సు ? 

.................................................. 

పువ్వులు గాలిని పట్టుకుంటాయి 
సత్యం స్వేచ్చగా సుడులు తిరుగుతుంది 
పక్షి పాట 


Gozan – మరణం 1733 వయస్సు  38 

.................................................. 

జననం -స్నానించాను 
మరణం -మళ్ళీ స్నానించాను 
అర్థంలేని మార్మికత 


Issa – మరణం 1827 వయస్సు  65 

.................................................. 

ప్రవహిస్తున్న గాలి
భగ్న గర్వాన్ని వీడి 
వెళ్ళిపోతున్నది నా చివరి కలయేనా 


Kyo’on – మరణం  1749 వయస్సు 63 

.................................................. 

పొడవాటి కల 
నిడివి లేని నిదురలోంచి 
మేలుకొంటూ 


Yayuu – మరణం  1783 వయస్సు  82 

.................................................. 

మొదటికి ముందు 
వొంటరి -శాంతి యెరుకతో మృత్యువు 
సూర్యుడిలోకి కరుగుతోన్న 
మంచు ముద్ద-జీవితం 


Nandai – మరణం  1817 వయస్సు  31 

.................................................. 

వికసితాలు కూలుతాయి 
పూల ప్రపంచంలో 
దేహం 


Kiko – మరణం  1823 వయస్సు  52

.................................................. 

యిప్పుడిది-యిప్పుడది 
పడిపోతూ 
గాలిని దారి మళ్ళించింది 


Ryokan – మరణం  1831 వయస్సు  74 

.................................................. 

వస్తున్నదానికి వస్తున్నదే తెలుసు 
పొతున్నదానికి పోతున్నదే తెలుసు 
పడిపోతున్న దాని అంచుల్ని పట్టుకోడమెందుకు 

స్వేచ్చగా తేలుతూ మబ్బులు 
గాలి యెక్కడ దెబ్బ కొడుతుందో 
యెప్పటికీ తెలియదు 


Sengai Gibon – మరణం  1837 వయస్సు  88 


                                                                                                                        స్వేచ్చానువాదం: దాము





 








 

Sunday, September 13, 2015

డ్రగ్ యెడిక్ట్

ముక్కల ముక్కల పాటగా దేహం 
ఆమెదో నాదో ఆమెదో నాదో 

మేన్ హోల్స్ రోడ్డు ఆమెది 
వొడ్డును  కోల్పోయిన నది నాది 
నీ చూపులకు వేలాడుతోంది 
నిశ్శబ్దం గోడ మీదుగా ప్రాకి వస్తోంది 
పొగలు రేగుతోన్న నీలి వూపిరి 
పసుపు-పచ్చ పురుగొకటి రెక్కలు 
ముడుచుకొని యెగరనంటోంది కదా 
మనిద్దరి వొంటరి చలి రాత్రిలోకి 
వేలి కొసలలోకి యేమో వెన్నెల వొలికిపోయింది 
చివరి చితి కూడా ఆరిపోయాక 
అతడు అద్దం లోకి నిష్క్రమించాడా-
వొక తాగుబోతు నక్షత్రం తూలిపడింది మీదికి 
యిక పువ్వుల రతిలోకి విచ్చుకుందామా 
పక్షుల మీదుగా యెగురుతోన్నఆకాశం కదా దేహం 

 

Wednesday, February 18, 2015

నేను, పిచ్చివాడు-జైలు



నాలో పిచ్చివాడు;
పిచ్చివాడిలో నేను
మేం జైల్లో; జైలు మాలో 
........................... 
అతను కలలు జీవిస్తాడు
నేనేమో అతన్లోకి దూరాలని తపిస్తాను
దూరంగా నుంచొని మమ్మల్ని గమనిస్తున్న జైలు 
బద్దకంగా ఆవులిస్తుంది 
.............................. 
సంకెల వేయబడి వొక్కో జీవితమే అడుగుపెడుతుంది 
నెమ్మదిగా కుదుపుకుని యిముడ్చుకుంటుంది జైలు
పిచ్చివాడెప్పుడూ మాట్లాడడు; మాట్లాడించబడుతాడు 
స్వగతంలో జైలు తెరలు తెరలుగా నవ్వుతోంది 
నేనలా దిగులుగా కూర్చుండి పోతాను 
................................
నిర్బంధ సామూహికతలోంచి వొంటరిగా పిచ్చివాడు 
వెలుపలి చెట్టుపై అతన్ని చూసి అరుస్తోన్న కాకి 
జైళ్ళు లేని ప్రపంచంలోకి తొంగి చూసే 
నన్ను చూసి పిచ్చివాడు వున్నట్టుండి 
బిగ్గరగా నవ్వుతాడు 
పోరాడే మనిషి కథను కొనసాగిస్తూ నేను 
సౌకుమార్యం గాయపడిన చప్పుడు చేస్తూ పిచ్చివాడు 
నాగరీకపు గుంభనంలో జైలు 
.............................. 
వలయపు చీకటిలో కవిత్వం కోసం దేవులాడుతూ నేను
ముఖమంతా పూలతోటై గుభాళిస్తూ పిచ్చివాడు 
1894 నాటి స్ఫోటకపు మచ్చల్తో జైలు 
అసంబద్ధంగా గతంలోకి ప్రవహించే నన్ను చూసి 
కాలాన్ని యీడ్చి తంతాడు పిచ్చివాడు 
'అరె చల్ రే యార్ -' యిద్దర్నీ బెత్తంతో కొడుతుంది 
జైలు
................................... 
వున్నట్టుండి తెలిసిపోతుంది నాకు 
జైలు వున్నంత దాకా
నేనూ పిచ్చివాడు సజీవిస్తాం

                                                                 .... వొకానొక జైలు కాలం 
                                                                      పలమనేరు సబ్ జైలు 

Monday, May 5, 2014

అతడొక నువ్వు


అతడు ఆకాశం మీదికి యెగబ్రాకిన 

రోడ్డు మీద వేలాడుతున్నాడు
అతడు శబ్దాల్ని తోలుకుంటూ 
దేహాన్ని మరచిపోయాడు 
వొక మహా సరీసృపమొక్కటి నగరం మీద వాలుతున్నపుడు 
అతడు కల కాగుతున్నాడు 

నువ్వు నడచిపో అతని వాసన మీదుగా 
ద్రవాన్ని భుజాన వేసుకుని వెళ్తున్నపుడు 
వొకసారి కళ్ళను ధరించు 

నీడలు కవాతు చేస్తున్నాయి కదా 
ఆగి జ్ఞాపకాల్ని చప్పరించు, చెమటతో పాటు 

యెండిన  గడ్డి మీదుగా వీచిన గాలి వొక 
ఆదిమ మృగమై దౌడుతీస్తున్నపుడు 
నిన్ను నువ్వు ఆవాహన చేసుకొని చూడు 

తుపాకుల తోరణాలు కట్టిన వూరిలోకి ప్రవేశిస్తున్నపుడు 
మాత్రం తల తీసి చేతిలో పట్టుకో 

అనేకసార్లు మరణించాక కూడా 
మనిషిలోకి జారిపోవద్దు 

నీ తల్లి గర్భంలోకి నువ్వు ఆర్థనాదమైనప్పుడు కదా 
పక్షులన్నీ బోనుల్లోకి వెళ్ళిపోయాయి 

                                        -3:00 a.m. 
                                         02. 05. 2014  



Friday, May 2, 2014

ఆమె



వొక పిడికిలి యెరుపు ఆమె మీదికి వూదాను
నిశ్శబ్దంలోంచి ఒక పదం తీసి
నా పెదవికి పూసింది

దూసరవర్ణ ఆకాశం లోంచి కొంచం గాలిని తెచ్చి
ఆమె ముఖాన్ని తాకాను
కాలంలోంచి ఒక చూపును నా దేహం మీద గుచ్చింది

దాచుకున్న చీకటిలోంచి కొంఛేమ్ వెలుతురు దొంగిలించి
ఆమె కనులలోకి వొంపాను
యెప్పటికీ తెలుసుకోలేను
ఆమె యెందుకలా అదృశ్యమైపోయిందో

.........................................................దాము ...2/5/2014

Friday, June 28, 2013

వొక సెల్ ఫోన్ శృంగారం తర్వాత....


మన చూడని తెరచుకొన్న కనుల మధ్య చూపులు లేని గోడ. 
స్థలాలు లేని దగ్గరితనంలోకి మనం నిరంతరం మ్రోగుతుంటాం కదా. 
నువ్వు గుంపుల్లోంచి నా దగ్గరికి యెగురుతావు. నేను కూడా.
నీ పెదాల తడి శబ్దమై నా లోకి దిగుతుంటుంది.
నా పదాలు పదాలు చినుకులై నిన్ను తడిపేస్తాయి లోపల.
నువ్వు కరిగి కరిగి కాలంలోకి నా వైపు ప్రవహిస్తావు.
నా గది మైనపు ముద్దలా కాలుతుంటుంది.
వొకో అక్షరం దేహ కణమై లోకి కణ కణ మంటూంటుంది.
మన వూహలు పెనవేసుకుంటాయా-
రహస్య సొరంగపు చీకటి వొకటి దేహాతీత దేహాత్త్మల అంగమై మొలుస్తుంది కదా.
నన్ను నేను వుసిగొల్పుతాను. నువ్వు కూడా.
                         .......

చూపుల స్పర్శ లేదు.
వూపిరి వేడి లేదు.
ముద్దుల మంత్ర ముగ్ధత లేదు.
దేహాల నృత్యమునూ లేదు.
కురిసిన వర్షంలో మెరిసిన అగ్ని చల్లారాక-
చార్జింగ్ అయిపోయిన డెడ్ సెల్ ఫోన్లలా
భూగోళానికి అటూ యిటూ మన రెండు దేహాలు.
యిద్దరి వొంటరి శూన్యం ఢీకొన్న చప్పుడు కూడా వినపడదు కదా. 

                                                                                                27. 06. 2013.
                                                                                                రాత్రి 12. 30.